సినీ కార్మికుల వేతనాల పెంపు.. చర్చలు మొదలెట్టాం, త్వరలోనే క్లారిటీ : దిల్‌రాజు

News

వేతనాల పెంపు కోరుతూ సినీ కార్మికులు చేసిన సమ్మె సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఒకే వేతనంతో పనిచేస్తున్నామని.. ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదంటూ వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు కార్మికులు సమ్మెకు దిగడంతో అన్ని షూటింగ్‌లు బంద్ అయ్యాయి. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర సినీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వేతనాల పెంపుకు నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎలా పెంచాలి, ఎంత పెంచాలి తదితర అంశాలపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు.

దీనిపై శుక్రవారం దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్‌ ఫెడరేషన్‌తో చర్చలు ప్రారంభించామని, సంబంధిత వివరాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌లతో జరిగిన భేటీ వివరాలను దిల్‌రాజు తెలియజేశారు. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ వారితో ఈ రోజు చర్చలు మొదలుపెట్టామని.. ఏ రోజు ఏం మాట్లాడుకున్నామో వాటన్నింటినీ క్రోడీకరించి, చివరి రోజు మీడియా ద్వారా వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఈ రోజు నుంచి షూటింగ్స్‌ యథావిధిగా ప్రారంభమయ్యాయని.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నీ పాసింగ్‌ క్లౌడ్స్‌‌గా దిల్‌రాజ్ అభివర్ణించారు. చిన్నా పెద్దా అనే తేడా ఏం లేదని.. నిర్మాతలంతా ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడిక్కడ 20 మంది ఉంటే వారిలో 12 మంది చిన్న సినిమాలు నిర్మిస్తున్నవారేనని… ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని దిల్‌రాజు పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *